ఆంధ్రప్రదేశ్‌లో నేడు వర్షాలు: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అలాగే ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపిస్తుండగా, ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో నేడు భారీ వర్షాలు, గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెదురుమదురు జల్లులు కురుస్తాయి. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనంతపురం, నంద్యాల సహా పలు జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా విజయనగరం జిల్లా మెరకముడిదాంలో 53.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మరోవైపు తెలంగాణలో ఈరోజు, గురువారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణలోని తూర్పు, ఉత్తర జిల్లాలను అప్రమత్తం చేశారు. ఈదురు గాలుల కారణంగా కొన్ని జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌లోనూ మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కుంచవెల్లిలో 13.2 సెం.మీ వర్షం కురిసింది. అదనంగా వికారాబాద్, మెదక్, ములుగు, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకుంటున్నాయి.